ఈ శని, ఆదివారాల్లో ఓటర్ నమోదుకు ప్రత్యేక డ్రైవ్
ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన ప్రక్రియను కచ్చితమైన కాలపరిమితిలో పారదర్శకంగా పూర్తి చేయాలని బోధన్ నియోజకవర్గ ఎలక్టోరల్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ ఎం.విజయ కుమారి ఆదేశించారు. బోధన్లోని పోలింగ్ కేంద్రం సంఖ్య 48 ను ఆమె ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు చేపట్టారు. నోటీసుల జారీ విధానం, విచారణల పురోగతితో పాటు ఎస్ఐఆర్ వెరిఫికేషన్ వివరాలను సిబ్బంది ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకుండా వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
కేంద్రాల వద్దే దరఖాస్తుల స్వీకరణ:
ఈ శని (సెప్టెంబర్ 5), ఆదివారాల్లో (సెప్టెంబర్ 6) నియోజకవర్గవ్యాప్తంగా ఓటర్ల నమోదు, సవరణలకు సంబంధించి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈఆర్వో వెల్లడించారు. ఈ రెండు రోజులూ అన్ని పోలింగ్ కేంద్రాల్లో బిఎల్ఓలు ప్రచురించిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాతో సిద్ధంగా ఉంటారని తెలిపారు. కొత్త ఓటరు నమోదుకు (ఫామ్-6), పేర్ల తొలగింపుకు (ఫామ్-7), తప్పుల సవరణకు (ఫామ్-8) అర్హులైన పౌరులంతా తమ దరఖాస్తులను నేరుగా బిఎల్ఓలకు అందజేసి, ఈ ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

