అమరవీరుల త్యాగాలు.. సమాజానికి ఆదర్శాలు
కర్తవ్య పరిరక్షణలో ప్రాణాలర్పించిన 21 మంది నిజామాబాద్ వీరులు
పోలీస్ అమరవీరుల త్యాగాలకు శతకోటి వందనాలు
సమాజంలో శాంతిభద్రతలను కాపాడటం, ప్రజల ప్రాణ ఆస్తులకు రక్షణగా నిలవడం కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదని, అది ఒక మహా యజ్ఞమని నిరూపించారు మన నిజామాబాద్ జిల్లా పోలీస్ యోధులు. ఆ యజ్ఞంలో తమ ప్రాణాలను సైతం సమిధలుగా సమర్పించి, అమరవీరులుగా నిలిచిన ధీరుల త్యాగనిరతి ఎప్పటికీ ఆదర్శనీయం. 1986 నుండి 2026 జూలై వరకు జిల్లాలో విధి నిర్వహణలో ప్రజల భద్రత కోసం తమ అమూల్యమైన జీవితాలను త్యాగం చేసిన 21 మంది అమరవీరుల త్యాగ చరిత్ర ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవింపజేస్తుంది. శాంతిభద్రతల పరిరక్షణలో ముందుండి నడిపిస్తూ సిఐ ఎం. లింగారెడ్డి, ఎస్ఐ ఈ. విక్టర్ అమరులు కాగా, అనుభవజ్ఞులైన అధికారులుగా విధి నిర్వహణలో ఎఎస్ఐలు టి. రామ్ చందర్ రావ్, ఎమ్.ఎ గఫార్ వీరమరణం పొందారు. హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ సర్వర్, ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ ఎమ్.డి జహంగీర్ ఉద్దీన్, హోంగార్డులు బాధవత్ గంగాధర్, దొడ్ల సీతారామ్ కూడా ప్రజా సేవలో వెరవక తమ ప్రాణాలను అర్పించారు.
అలాగే కానిస్టేబుళ్లు బి. సోమరాజ్, ఏ. రామచంద్రర్, ఎమ్.డి బషీరుద్దీన్, ఎమ్.డి గౌస్, బి. గణేష్, వి. నర్సయ్య, ఎన్. అంజయ్య, చౌటి గంగాధర్, ఎన్. శంకర్ గౌడ్, ఎంపల్లి ప్రమోద్ కుమార్ లు ప్రజల రక్షణ కోసం నిరంతరం తపిస్తూ, తమ చిన్న వయసులోనే విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి అమరులయ్యారు. తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో భాగంగా గ్రేహౌండ్స్ విభాగంలో సేవలందిస్తూ అత్యంత కఠినమైన పరిస్థితుల్లోనూ ధైర్యంగా పోరాడి జూనియర్ కమాండోలు ఎమ్.ఎ మోయిన్, వడ్ల శ్రీధర్, మాతారీ మొగులయ్య అమరులై నిలిచారు.
మన ప్రశాంత జీవితాల వెనుక ఈ అమరవీరుల త్యాగాలు, వారి కుటుంబాల కన్నీళ్లు దాగి ఉన్నాయి. పండుగలైనా, పబ్బాలైనా తమ కుటుంబాలను వదిలి సమాజ రక్షణే ధ్యేయంగా పనిచేసిన ఈ యోధుల త్యాగం వర్ణనాతీతం. తమ కంటిపాపలను, భర్తలను, తండ్రులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలోనూ తమ వారు సమాజం కోసం ప్రాణాలర్పించారని గర్వంగా చెప్పుకునే ఆ అమరవీరుల కుటుంబాలకు సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. ఈ అమరుల త్యాగాలను స్మరించుకోవడం, వారి కుటుంబాలకు తోడుగా నిలవడం మనందరి కనీస బాధ్యత.

