పింఛన్లపై సర్కారు జాప్యం... వికలాంగుల హక్కుల వేదిక ఆగ్రహం
దసరా వేళ లబ్ధిదారుల అవేదన
దసరా పండుగ వేళ వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు అందక అవస్థలు పడుతున్నారని జాతీయ వికలాంగుల హక్కుల వేదిక నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు గైని రాములు, ఎడపల్లి మండల అధ్యక్షుడు రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుపై మండిపడిన వారు.. తక్షణమే పింఛన్ల పంపిణీ చేపట్టి పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఇంటా పండుగ సంతోషాలు వెల్లివిరియాల్సిన సమయంలో, పింఛన్లపైనే ఆధారపడి జీవించే నిరుపేదలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగకు ముందే పింఛన్లు వస్తాయని ఆశించిన లబ్ధిదారులకు నిరాశే మిగిలిందన్నారు. వయసు మీదపడి పనిచేసే శక్తి తగ్గిన వృద్ధులు, కుటుంబ భారాన్ని మోస్తున్న వితంతువులు, నిత్యం ఇబ్బందులు ఎదుర్కొనే వికలాంగులకు ఈ పింఛనే ప్రధాన జీవనాధారమని నాయకులు గుర్తుచేశారు. మందులు, నిత్యావసరాల కోసం ఈ మొత్తంపైనే ఆధారపడే వారికి పండుగ సమయంలోనూ సొమ్ము అందకపోవడం దారుణమన్నారు. దసరా లాంటి పెద్ద పండుగ వేళ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో పింఛన్లను పంపిణీ చేయాల్సిందని, పాలకులు పేదల పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. పింఛన్ అనేది దయతో ఇచ్చే సాయం కాదని, పేదలు గౌరవంగా జీవించేందుకు అవసరమైన హక్కు అని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పింఛన్లను పంపిణీ చేయాలని, భవిష్యత్తులో పండుగల వేళ ఇలాంటి జాప్యం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని గైని రాములు, రాజు డిమాండ్ చేశారు.

