"బడి మళ్లీ పిలిచింది.. జ్ఞాపకాలు చిగురించాయి"
మధుర జ్ఞాపకాల వేదిక.... పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జీవితంలో ఎన్నో సాధించినా, ఎన్నెన్నో మైలురాళ్లు దాటినా.. బాల్యం చిలికిన స్మృతుల ముందు ఏదీ సరితూగదని నిరూపించింది ఆ రోజంతా. ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం ఒకే ఒక్క రోజులో 65 ఏళ్ల కాలాన్ని వెనక్కి తిప్పేసింది. తరాలు వేరైనా పలకరింపు ఒకటే: 1959లో బడి గుమ్మం తొక్కిన శేష జీవితంలోని ముత్తాతల నుంచి.. నిన్న మొన్నటి 2023 బ్యాచ్ యువకుల వరకు 1500 మంది పూర్వ విద్యార్థులు మైదానంలో నిలబడితే అది వేడుక కాదు, ఒక అద్భుతం. "రేయ్ బావ.. ఎలా ఉన్నావురా?" అని ఒకరంటే, "మాష్టారూ.. గుర్తొచ్చానా?" అంటూ వృద్ధాప్యంలో ఉన్న గురువు పాదాలను పట్టుకున్న ఇంకొకరు. వయసు, హోదాల సరిహద్దులు చెరిగిపోయి, కేవలం బడి జ్ఞాపకాల అనుబంధమే రాజ్యమేలింది.
గురుభక్తికి నిదర్శనం: జీవితాన్ని తీర్చిదిద్దిన గురువులను మహోన్నతంగా గౌరవించడం, శాలువాలు కప్పి పాదాభివందనాలు చేయడంలో ఆ విద్యార్థుల సంస్కారం కనిపించింది. మమకారంతో బడి రుణం: తమకు అక్షరాలు నేర్పిన బడి మౌలిక వసతులతో వెలగాలని రూ. 7 లక్షల విరాళాన్ని సేకరించి పాఠశాల అభివృద్ధికి చేతులు కలిపారు. సూర్యుడు అస్తమిస్తున్నా.. చెట్ల కింద కూర్చుని టిఫిన్ బాక్స్లు షేర్ చేసుకున్న క్షణాలను, గ్రౌండ్లో పరిగెత్తిన రోజులను మాట్లాడుకుంటూ విడిపోవడానికి విద్యార్థుల మనసు ఒప్పలేదు. ఒక అద్భుతమైన జ్ఞాపకాన్ని గుండెల్లో పదిలం చేసుకుంటూ, మళ్లీ కలవాలనే ఆశతో సెలవు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు తోట రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి రాజశేఖర్తో పాటు విశ్రాంత న్యాయమూర్తి హజార్ హుస్సేన్, విశ్రాంత జైలు సూపరింటెండెంట్ జహీరా బేగం, విశ్రాంత ఉపాధ్యాయులు వెంకటేశ్వర్ రావు, ఆనందరావు, కొమురయ్య, సుశీల, జయ సాగర్, అమీర్ అమర్, రమేష్, హన్నా గ్రేస్, రజిని, నరేందర్, స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.


