22-ఏ నిషేధిత జాబితాపై 'కమల' సమరభేరి
కాంగ్రెస్ తీరుపై నిజామాబాద్ బీజేపీ శ్రేణుల మండిపాటు
ఇందిరాపార్కు దీక్షకు ఎమ్మెల్యే ధనపాల్ నాయకత్వంలో తరలిన బీజేపీ శ్రేణులు
రాష్ట్రంలో అమాయక ప్రజలు, రైతుల భూములను 22-ఏ (నిషేధిత భూముల) జాబితాలో చేర్చి వేధింపులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించింది. ఈ మేరకు రాజధాని హైదరాబాద్లోని ఇందిరాపార్కు వేదికగా పార్టీ చేపట్టిన మహాదీక్షకు మద్దతుగా ఇందూరు శ్రేణులు భారీగా కదిలాయి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం వేలాది మంది నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా 22-ఏ జాబితాలో చేర్చిన భూముల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, బాధిత రైతులకు, సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, భూ యజమానుల హక్కుల పరిరక్షణకు తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం దిగివచ్చి సమస్యను పరిష్కరించే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి, పలువురు కార్పొరేటర్లు, మండలాల అధ్యక్షులు, వివిధ మోర్చాల ముఖ్య నేతలు పాల్గొన్నారు.


