పాఠశాలల్లో అసంపూర్తి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
కేజీబీవీలు, ప్రభుత్వ విద్యా సంస్థలపై ఎంఈఓలు, ఎంఎస్ఓలతో సమీక్ష
హాజరుపై ఎఫ్.ఆర్.ఎస్ విధానం తప్పనిసరి.. లేకుంటే జీతాల నిలిపివేత
జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఇతర ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన అసంపూర్తి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో మంగళవారం ఎంఈఓలు, మండల స్పెషల్ ఆఫీసర్లతో కలెక్టర్ విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పలు చోట్ల సివిల్ పనులు మందకొడిగా సాగుతుండటంపై ఇంజనీరింగ్ అధికారుల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కేజీబీవీల్లో నూతన భవన నిర్మాణాలు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, డ్రైనేజీ నిర్మాణాల ప్రగతిని సమీక్షించి వేగం పెంచాలన్నారు. ఇప్పటివరకు మంజూరీలు రాని పనులకు సంబంధించి 'వీబీ జీరాంజీ' కింద ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఎం.ఎస్.ఓలు, ఎం.ఈ.ఓలు నెలకు కనీసం రెండుసార్లు కేజీబీవీలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని, బాలికలకు పరిశుభ్రమైన, నాణ్యమైన పౌష్టికాహారం అందేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
పాఠశాలల్లో ముఖ గుర్తింపు విధానం ఆధారిత హాజరును నూటికి నూరు శాతం అమలు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే వేతనాలు నిలిపివేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. పాఠశాల ఆవరణలను పరిశుభ్రంగా ఉంచాలని, అపరిశుభ్రత కారణంగా విద్యార్థులు అతిసారం, డెంగీ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడితే సంబంధిత ఎంఈఓలనే పూర్తి బాధ్యులను చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకే తమ మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణాల ప్రగతిని, నాణ్యతా ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ఇంచార్జి జిల్లా విద్యాశాఖాధికారి సాయాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


