బోధన్‌లో వైభవంగా ఎంవీఆర్ ఆసుపత్రి ప్రారంభోత్సవం
ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం: డాక్టర్ విఘ్నేశ్వర్, మౌనిక
బోధన్ పట్టణంలోని సరస్వతీనగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘యం.వి.ఆర్. హాస్పిటల్’ ప్రారంభోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బోధన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్, ఎస్‌హెచ్‌ఓ వెంకటనారాయణ, తహసీల్దార్ విఠల్ ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ యం. విఘ్నేశ్వర్, డాక్టర్ యం.మౌనిక మాట్లాడుతూ... బోధన్ పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలను అందుబాటులోకి తేవడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. డాక్టర్ యం.మౌనిక బోధన్ పట్టణంలోనే మొట్టమొదటి మహిళా సర్జన్ కావడం గమనార్హం. ఆసుపత్రిలో చిన్నపిల్లలు, నవజాత శిశు సంరక్షణ కోసం ప్రత్యేక ఎన్‌ఐసీయూ విభాగం, పసిపిల్లల కామెర్లకు అడ్వాన్స్డ్ ఎల్‌ఈడీ ఫోటోథెరపీ, ఎక్స్ఛేంజ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్, టీకాలు, నెబ్యులైజేషన్‌తో పాటు న్యుమోనియా, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి జ్వరాలు, ఆస్తమా, చర్మ సమస్యలకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. అలాగే థైరాయిడ్, హెర్నియా, హైడ్రోసిల్, కిడ్నీ మరియు గాల్ బ్లాడర్ రాళ్లు, అపెండిసైటిస్, పైల్స్, ఫిషర్, ఫిస్టులా సమస్యలకు మెరుగైన శస్త్రచికిత్సలతో పాటు గర్భాశయ గడ్డలు, రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ చికిత్సలు, లాపరోస్కోపిక్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. బాధితులకు నిరంతరం సేవలందించేందుకు 24 గంటల అత్యవసర వైద్యం, ల్యాబొరేటరీ, మెడికల్ షాప్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ ప్రారంభోత్సవంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాము, ఎంఐఎం పట్టణాధ్యక్షుడు అలియాస్, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, బీజేపీ పట్టణాధ్యక్షుడు గోపి, మారుతి మందిర్ చైర్మన్ గుండేడి శంకర్, నాయకులు ఆదినారాయణ, బలరాజ్, గుంత గంగాధర్, ఎన్పీడీసీఎల్ ఏఈ నియీని కృష్ణ, ఎస్‌ఐ హబీబ్, ఆసుపత్రి సిబ్బంది, స్థానిక వైద్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.


