బాన్సువాడలో ఉద్రిక్తతలకు చెక్ – 3 గంటల్లో పరిస్థితి అదుపులోకి, 19 మంది అరెస్ట్
బాన్సువాడ, ఫిబ్రవరి 22(డిడి9 వార్త): బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్ శాఖ తక్షణమే అదుపులోకి తీసుకువచ్చింది. సంఘటన జరిగిన వెంటనే అదనపు బలగాలను మోహరించి, కేవలం మూడు గంటల్లోనే పరిస్థితిని పూర్తిగా నియంత్రించడంలో పోలీసులు విజయవంతమయ్యారు. ప్రస్తుతం పట్టణంలో పరిస్థితి యథాస్థితికి చేరుకుంది.సీసీటీవీ ఫుటేజ్ మరియు సోషల్ మీడియా ఆధారాల ప్రకారం మొత్తం 42 మంది వ్యక్తులను గుర్తించగా, ఇప్పటివరకు 19 మంది నిందితులను అరెస్టు చేశారు. మిగతా వ్యక్తులను త్వరలోనే గుర్తించి చట్టం ముందు హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో పాల్గొన్న వారందరి పై కమ్యూనల్ సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసి భవిష్యత్తులో కఠిన నిఘా కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు.ప్రజల్లో భద్రతాభావాన్ని బలోపేతం చేయడం, శాంతిభద్రతల పట్ల విశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ఈ ఫ్లాగ్ మార్చ్ ఓల్డ్ వీక్లీ మార్కెట్, గోల్డ్ షాప్ ప్రాంతం, జెండా గల్లి, ఓల్డ్ షేక్ చాంద్ హోటల్, మున్సిపల్ ఆఫీస్ ప్రాంతం, ఇస్లాంపూర్, గౌలిగూడ, హనుమాన్ టెంపుల్, హర్పత్ కాలనీ, రిలయన్స్, రిలయన్స్ స్మార్ట్ ఏరియా, తాడ్కోల్ చౌరస్తా, బస్టాండ్ ప్రాంతాల మీదుగా తిరిగి పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. సుమారు 120 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని సుమారు 6 కిలోమీటర్ల మేర పర్యటించారు.ఈ సందర్భంగా ఎస్పీ యం రాజేష్ చంద్ర మాట్లాడుతూ, చట్టవిరుద్ధంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బలవంతపు బంద్‌కు పాల్పడిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదికల ద్వారా తప్పుడు, ప్రేరేపిత లేదా రెచ్చగొట్టే సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు ప్రారంభించామని చెప్పారు.చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. వాట్సాప్ వంటి వేదికలలో అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేయడం తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. గ్రూప్ నిర్వాహకులు తప్పుడు సమాచారాన్ని వెంటనే తొలగించాలని, అలాంటి సమాచారాన్ని పంపిన వారిపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ ఘటనకు సంబంధించి నిజామాబాద్, నస్రుల్లాబాద్ మరియు సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి. అన్ని కేసుల్లో విచారణ వేగవంతంగా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.పట్టణంలో శాంతి, సామరస్యాలను కాపాడటం ప్రతి పౌరుడి సామూహిక బాధ్యత అని ఎస్పీ పేర్కొన్నారు. వదంతులను నమ్మకుండా పోలీస్ శాఖకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆస్తి నష్టం జరిగిన వారు నిర్భయంగా ఫిర్యాదులు నమోదు చేయాలని సూచించారు. అందిన ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఫ్లాగ్ మార్చ్‌లో బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్హెచ్ఓ శ్రీధర్, సీఐ రవి, రూరల్ ఇన్స్పెక్టర్ తిరుపయ్యతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

