'టైర్ పంక్చర్' యజమాని కుమార్తె డీఎస్పీ
- తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1 విజయం - 315వ ర్యాంక్
- ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన అల్లెపు మౌనికకు అరుదైన గౌరవం
ములుగు సెప్టెంబర్ 27 (డిడి 9 వార్త): పట్టుదల ముందు పేదరికం అడ్డంకి కాదని ములుగు జిల్లాకు చెందిన యువతి నిరూపించింది. మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అల్లెపు మౌనిక తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1లో విజయం సాధించి, ఏకంగా డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) గా ఎంపికయ్యారు.
మౌనిక తండ్రి సమ్మయ్య గ్రామంలో చిన్న టైర్ పంక్చర్ షాపును నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నిరంతర శ్రమ, పట్టుదలతో చదువుకున్న మౌనిక, తన తండ్రి ఆశయాలను నిజం చేస్తూ ఈ అరుదైన విజయాన్ని అందుకున్నారు.
తాజాగా ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో మౌనిక తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసి 315వ ర్యాంక్ సాధించారు. ఈ ర్యాంకుతో ఆమెకు డీఎస్పీ పోస్టు దక్కింది. టైర్ పంక్చర్ షాపు యజమాని కుమార్తె డీఎస్పీగా ఎంపిక కావడంపై మల్లంపల్లి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి పడిన ఆమె కష్టాన్ని, పట్టుదలను పలువురు అభినందిస్తున్నారు.

