అధికారుల నిర్లక్ష్యం.. ప్రకృతి వనానికి గ్రహణం
అడ్డగోలుగా చెట్ల నరికివేత.. కంచె ధ్వంసం
ట్రాన్స్‌కో, పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం అధికారుల బాధ్యతారాహిత్యానికి బలవుతోంది. పచ్చని చెట్లను కాపాడాల్సిన వారే గొడ్డళ్లతో విరుచుకుపడటంతో వనం రూపురేఖలు మారిపోయాయి. విద్యుత్ తీగలకు అడ్డు వస్తున్నాయనే సాకుతో ఏకంగా చెట్లనే నరికివేయడమే కాకుండా, వనం చుట్టూ ఉన్న రక్షణ కంచెను (ఫెన్సింగ్) కూడా ధ్వంసం చేయడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అస్తవ్యస్తంగా పనులు..
విద్యుత్ లైన్ల నిర్వహణ పేరుతో రంగంలోకి దిగిన ట్రాన్స్‌కో సిబ్బంది, కనీస నిబంధనలు పాటించకుండా వ్యవహరించారు. కేవలం కొమ్మలను మాత్రమే తొలగించాల్సి ఉండగా, చెట్లను మొద్దులుగా మార్చేశారు. ఈ ప్రక్రియలో వనం చుట్టూ ఏర్పాటు చేసిన కంచెను అడ్డదిడ్డంగా తొలగించి పక్కన పడేశారు. దీంతో మూగజీవాలు లోపలికి ప్రవేశించి మిగిలిన మొక్కలను కూడా నాశనం చేసే ప్రమాదం ఏర్పడింది.
పర్యవేక్షణ కరువు..
గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉన్న ఈ వనాన్ని సంరక్షించడంలో స్థానిక యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కంచెను ధ్వంసం చేస్తున్నా పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ జరిపి, పర్యావరణానికి విఘాతం కలిగించడంతో పాటు ప్రభుత్వ ఆస్తిని నష్టం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


