రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన బాధితులు
బాన్సువాడ, మే 01(డిడి9 వార్త):
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పరిధిలోని కంశెట్ పల్లి గ్రామానికి చెందిన బాధిత కుటుంబం శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి తమ గోడును వినిపించారు. గ్రామంలో చోటుచేసుకున్న ఘటనపై న్యాయం చేయాలని కోరుతూ దళిత నాయకుడు కాదేపురం గంగన్న ఆధ్వర్యంలో వారు చైర్మన్‌ను ప్రత్యక్షంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు తమకు జరిగిన అన్యాయం, ఎదుర్కొంటున్న ఇబ్బందులను చైర్మన్‌కు వివరంగా తెలియజేశారు.తమపై జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటివరకు సరైన న్యాయం జరగలేదని, పోలీసుల స్పందన తగిన విధంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల విన్నపాన్ని శ్రద్ధగా విన్న చైర్మన్ బక్కి వెంకటయ్య వెంటనే స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.దీనిపై స్పందించిన కాదేపురం గంగన్న మాట్లాడుతూ, చైర్మన్ చాలా సానుకూలంగా స్పందించారని, వెంటనే బాన్సువాడ డీఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి కేసును సీరియస్‌గా తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. బాధ్యులపై ఎటువంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసినట్లు చెప్పారు. పోలీసుల పనితీరుపై చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాను పర్యవేక్షణ కొనసాగిస్తానని హామీ ఇచ్చినట్లు వివరించారు.అదేవిధంగా బాధిత కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని, ఎలాంటి బెదిరింపులు లేకుండా న్యాయపరమైన సహాయం అందించాలని కూడా చైర్మన్ సూచించినట్లు గంగన్న తెలిపారు. బాధితులకు అండగా ప్రభుత్వం నిలబడాలని, దళితులపై జరిగే అన్యాయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీయస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు గరుగల్ల శ్రీనివాస్, రొడ్డ వెంకటి, కొండాపూర్ లక్ష్మన్‌తో పాటు ఇతర దళిత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

