చౌట్‌పల్లిలో వైభవంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవం
కమ్మర్ పల్లి మండల పరిధిలోని చౌట్‌పల్లి గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జాతర మహోత్సవంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన రథోత్సవానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుండి సర్వదర్శనాలు ప్రారంభం కావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రమైంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో రథ హోమం, రథ బలిహరణం వంటి వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నిర్వహించిన రథయాత్ర, రథ భ్రమణం కోలాహలంగా సాగింది. సహస్రాధిక ప్రతిష్టాపనాచార్య, రాష్ట్ర ఉగాది నంది పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ గంగా ప్రసాద్ దీక్షితులు నేతృత్వంలోని వేద పండితుల బృందం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను పర్యవేక్షించింది. ఈ సందర్భంగా శ్రీ సముద్రాల అమర్నాథ్ చార్యులు, శ్రీనాథ్ ఆచార్యులు నిర్వహించిన ద్రవిడ వేద పారాయణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మధ్యాహ్నం జరిగిన ఈ అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ వేడుకల్లో గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలతో పాటు ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఏటా నిర్వహించే ఈ జాతరతో చౌట్‌పల్లి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

