చెడు అలవాట్లకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు : ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
వైభవంగా ముగిసిన నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రీమియర్ లీగ్
క్రీడలతోనే మానసిక ఉల్లాసం: పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, క్రీడలు మరియు విద్యపై దృష్టి సారించినప్పుడే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో గత ఎనిమిది రోజులుగా మహిళా కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. యువత జీవిత నిర్మాణ దశలో ఉన్నందున తప్పుడు దారుల వైపు వెళ్లకుండా లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యంగా నగరంలో రాత్రి సమయాల్లో పెరుగుతున్న బెట్టింగ్ కార్యకలాపాలపై యువత అప్రమత్తంగా ఉండాలని, పోలీసులు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో చురుకుగా పాల్గొని శారీరక సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగానికి భారీగా నిధులు కేటాయిస్తోందని, జిల్లాలో వాకింగ్, రన్నింగ్ ట్రాక్‌ల నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు. పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మాట్లాడుతూ.. తాను క్రీడల్లో రాణించడం వల్లే ఐపీఎస్ సాధించగలిగానని, మొబైల్ వ్యసనం మరియు మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండటానికి క్రీడలు అద్భుతమైన మార్గమని పేర్కొన్నారు. ఏప్రిల్ 20 నుండి నిర్వహించిన ఈ లీగ్‌లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ వంటి పోటీలు హోరాహోరీగా సాగాయి. క్రికెట్‌లో విక్కీ ఎలెవన్ సుభాష్ గార్డెన్ జట్టు ప్రథమ స్థానంలో నిలిచి లక్ష రూపాయల నగదు బహుమతిని గలుచుకోగా, కబడ్డీలో రెంజల్ ప్రొడెన్సీ, బాస్కెట్‌బాల్‌లో ప్రొడెన్సీ ఎన్బీఏ, వాలీబాల్‌లో కమ్మర్‌పల్లి జట్లు విజేతలుగా నిలిచాయి. 36 బంతుల్లో 102 పరుగులు సాధించిన మాజిద్‌కు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న దీపక్‌కు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మేయర్ ఉమారాణి, నుడా చైర్మన్ కేశ వేణు మరియు పోలీస్ అధికారులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



