మహనీయుల బాట.. ప్రగతికి బాట : ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

బోధన్‌లో వైభవంగా మహనీయుల జయంత్యోత్సవ సభ

మహనీయుల బాట.. ప్రగతికి బాట : ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

అణగారిన వర్గాల చైతన్యానికే వారు కృషి చేశారు

kkkkk
సమాజంలో అణచివేతకు గురైన వర్గాల అంధకార జీవితాల్లో జ్ఞాన గుళికలతో వెలుగులు నింపిన మహనీయుల చరిత్ర మహోన్నతమైనదని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి బోధన్‌ పట్టణంప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ‘మహనీయుల జయంత్యోత్సవ సభ’ కన్నులపండువగా జరిగింది. ఈ సభకు గోరటి వెంకన్న ముఖ్య అతిథిగా విచ్చేసి తనదైన శైలిలో ఆటపాటలు, పదునైన ప్రసంగంతో ప్రజలను చైతన్యపరిచారు.
సమానత్వమే సమాజ శ్రేయస్సు
ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ.. మనిషిని మనిషిగా గౌరవించని ఆనాటి దుర్మార్గపు సామాజిక వ్యవస్థను చూసి చలించిపోయిన బుద్ధుడు, అంబేడ్కర్, మహాత్మా జ్యోతీబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, సంత్ సేవాలాల్, బాబూ జగ్జీవన్ రామ్ వంటి మహనీయులు తమ జీవితాలను త్యాగం చేసి బహుజన లోకాన్ని మేల్కొల్పారని కొనియాడారు. "సకల అసమానతలు, ఆధిపత్య ధోరణులు తొలగించబడాలనేదే బౌద్ధ ధర్మం యొక్క అంతిమ లక్ష్యం" అని ఆయన స్పష్టం చేశారు. నేటి యువత ఈ మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఐక్యతతోనే సామాజిక మార్పు
సభలో అతిథిగా పాల్గొన్న బహుజన టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రతినిధి మెగావత్ సంతోష్ నాయక్ మాట్లాడుతూ.. జనాభాలో సింహభాగం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. బహుజనులు ఏకమైతేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని, దానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్షీరాం గారు చేసిన పోరాటమే నిదర్శనమని పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాది, డివిజన్ కమిటీ కన్వీనర్ నీరడి ఈశ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో.. తొలుత వేదికపై ఉన్న మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
సాంస్కృతిక హోరు.. ఆలోచనల జోరు
సభ ఆద్యంతం కళాకారుల ప్రదర్శనలతో ఉత్తేజభరితంగా సాగింది. ప్రముఖ గాయకుడు గజ్జెల అశోక్ బృందం ఆలపించిన విప్లవ, చైతన్య గీతాలు ఆలోచింపజేశాయి. ముంబయి నుంచి విచ్చేసిన దమ్మ జ్యోతి సింధే, బాలేరావు ‘అమ్నా-సామ్నా’ కళాకారుల బృందం తమ బహుజనవాద గేయాలతో సభికులను ఉర్రూతలూగించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మీర్ ఇలియాస్ అలీ, బామ్సెఫ్ జిల్లా ప్రతినిధి సాగర్, డివిజన్ కమిటీ గౌరవ అధ్యక్షుడు పరిమి కోటేశ్వర్రావు, కో-కన్వీనర్లు నీరడి రవి, వాగ్మారే సూర్యకాంత్, శ్రావణ్, కొండ్ర వెంకటితో పాటు నియోజకవర్గ పరిధిలోని వివిధ దళిత, బహుజన సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

121

Views: 26
Tags:

About The Author

Latest News