ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా భారీ ర్యాలీ
కామారెడ్డి, ఏప్రిల్ 09(డిడి9 వార్త):
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుంచి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా గురువారం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, ప్రజల్లో ఆరోగ్య సంరక్షణ పట్ల చైతన్యం కలిగించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.అంతకుముందు నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో భాగంగా సంపూర్ణ సురక్ష కేంద్రం, ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ కేంద్రాల ద్వారా ప్రత్యేక వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆరోగ్య వారోత్సవాల ద్వారా ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడమే లక్ష్యమని, ముఖ్యంగా మహిళలు, పిల్లలు మరియు ప్రత్యేక వర్గాల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. పరిశుభ్రత, పోషకాహారం, నివారణాత్మక వైద్యంపై దృష్టి పెట్టడం ద్వారా అనేక వ్యాధులను ముందుగానే నివారించవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి రవీందర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్, డీసీహెచ్‌ఎస్ విజయ భాస్కర్ రెడ్డి, ఆర్డీవో ఎన్.వి. గిరి, తహసీల్దార్ హిమబిందు, డీపీఆర్‌ఓ తిరుమల, ఎంపీడీఓ రాణి, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

