ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు చేపడుతున్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తొలి విడతగా ఈ నెల 5, 6 తేదీల్లో, మలి విడతగా 12, 13 తేదీల్లో క్యాంపెయిన్ కొనసాగుతుందన్నారు.
ప్రత్యేక నమోదు రోజుల వేళ ప్రతీ పోలింగ్ కేంద్రంలో బూత్ లెవల్ అధికారులు, బూత్ లెవల్ ఏజెంట్లు అందుబాటులో ఉంటారన్నారు. ప్రజా పరిశీలన నిమిత్తం ముసాయిదా ఓటరు జాబితాతో పాటు అవసరమైన ఫారాలను సిద్ధంగా ఉంచుతారని వివరించారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6, పేర్ల తొలగింపునకు ఫారం–7, వివరాల సవరణ, చిరునామా మార్పులకు ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అర్హులైన పౌరులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ సమీప పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటరు జాబితాలో పేర్లను సరిచూసుకోవాలని కలెక్టర్ కోరారు.

