స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
కేసీఆర్‌కు దగ్గరగా ఉండే నేతలే ఆమె లక్ష్యం
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజం
బిఆర్‌ఎస్ పార్టీని, గులాబీ అధినేత కేసీఆర్‌ను బలోపేతం చేసేందుకు తొలినుంచి శ్రమించిన నేతలనే లక్ష్యంగా చేసుకుని కవిత విమర్శలు చేయడం వెనుక తీవ్ర కుట్ర దాగి ఉందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకే కేసీఆర్ ఆమెను సస్పెండ్ చేశారని, ఆ నిజాలను దాచి తనపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. "తాము పార్టీ వ్యవస్థాపక సభ్యులమని, బీఆర్‌ఎస్ తన ఊపిరి అని పేర్కొన్నారు. కవితను రెండుసార్లు ఎమ్మెల్సీ చేయడంలో తన పాత్ర ఏంటో కేసీఆర్‌కు తెలుసన్నారు. తాను కాంగ్రెస్‌తో మాట్లాడానని చెబుతున్న కవిత.. మరి తాను ఏనాడూ రహస్య మంతనాలు జరపలేదని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చెప్పగలరా?" అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి విధానాలపై నిరంతరం పోరాడుతున్న తమపై అసత్యాలు ప్రచారం చేయడం వెనుక స్వలాభం తప్ప మరొకటి లేదన్నారు.
రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌ను కవిత వ్యాఖ్యలు తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తులైన హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డిలను టార్గెట్ చేయడం ద్వారా బిఆర్‌ఎస్‌ను బలహీనపరచడమే కవిత ప్రధాన ఉద్దేశమని విమర్శించారు. సభలలో కన్నీళ్లు కార్చడం కేవలం రాజకీయ సానుభూతి కోసమేనని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా నిరాధార ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.

