గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
మత సామరస్యాన్ని కాపాడాలి .... శాంతి కమిటీ సమావేశంలో సీపీ సాయి చైతన్య
గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిజామాబాద్ జిల్లా ప్రజలు ప్రశాంతమైన, సోదరభావ వాతావరణంలో వైభవంగా జరుపుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య పిలుపునిచ్చారు. గురువారం బోధన్‌లోని లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పండుగలు మనుషుల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని, ప్రతి ఒక్కరూ పరస్పరం సహకరించుకుంటూ మత సామరస్యాన్ని కాపాడాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణలో పోలీసు శాఖ సూచించిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సీపీ స్పష్టం చేశారు. మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని, భక్తులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్, పార్కింగ్ మేనేజ్‌మెంట్ సరిగ్గా ఉండాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులకే ప్రాధాన్యత ఇవ్వాలని, ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులకు బదులు స్టీల్ పాత్రలనే వాడాలన్నారు. డీజేలు, సౌండ్ సిస్టమ్స్ విషయంలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేయాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను, వదంతులను ప్రజలు నమ్మవద్దని.. అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు.
ఈ సమావేశంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, బోధన్ ఎస్‌హెచ్‌ఓ వెంకటనారాయణ, బోధన్ రూరల్ సీఐ విజయబాబు, రుద్రూర్ సీఐ కృష్ణ, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ యాదగిరి, కోటగిరి ఎస్‌ఐ శ్రీనివాస్, రెంజల్ ఎస్‌ఐ గంగాధర్, ఎడపల్లి ఎస్‌ఐ ఎం. రమ, వర్ని ఎస్‌ఐ వంశీకృష్ణ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాస్, పట్టణ వీడీసీ కమిటీ అధ్యక్షులు గంగాధర్ రావు పట్వారి, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ దాము, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ గోపి, సార్వజనిక గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పూజారి లింగం, మున్సిపల్ కౌన్సిలర్లు, నియోజకవర్గం, వివిధ మండలాలు, గ్రామాల సర్పంచులు, సార్వజనిక గణేష్ మండలీల సభ్యులు, నిర్వాహకులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


