పెద్దమ్మకాడి తండాను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
అభివృద్ధి పనుల పరిశీలనలో డీఆర్‌డీఓ సాయన్న
పెద్దమ్మకాడి తండా గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయన్న ఆదేశించారు. సోమవారం ఆయన భీమ్‌గల్ మండలంలోని బడా భీమ్‌గల్, పెద్దమ్మకాడి తండా గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తున్న వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
బడా భీమ్‌గల్‌లో కమ్యూనిటీ ఇంకుడు గుంతను, పెద్దమ్మకాడి తండాలో రైతు పొలంలో నిర్మిస్తున్న వ్యవసాయ నీటి కుంట పనులను పరిశీలించి అధికారులకు నాణ్యతా ప్రమాణాలపై సూచనలు చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలోని వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, ఇంకుడు గుంతల వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అనంతరం ఐకేపీ సిబ్బందితో సమావేశమై స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ పురోగతిపై సమీక్షించారు. మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతనిచ్చేలా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, ఏపీఎం ప్రమీల, సర్పంచులు బుక్య రమేష్, విష్ణువర్ధని, పంచాయతీ కార్యదర్శి మమత తదితరులు పాల్గొన్నారు.

