నకిలీ సర్టిఫికెట్లపై సమగ్ర విచారణ జరపాలి
అర్హులైన నిరుద్యోగుల హక్కులను కాలరాయకండి: బీజేపీ మండల అధ్యక్షుడు చందూరి హన్మండ్లు
బాన్సువాడ, ఆగస్టు 09(డిడి9 వార్త): తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల నియామకాలు, కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ మండల అధ్యక్షుడు చందూరి హన్మండ్లు డిమాండ్ చేశారు. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం నుంచి రెగ్యులరైజేషన్ వరకు ప్రతి అంశాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు.కాంట్రాక్ట్ లెక్చరర్ల సర్టిఫికెట్ల పునఃపరిశీలనలో భాగంగా 37 మంది లెక్చరర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయినట్లు వస్తున్న సమాచారం ఆందోళన కలిగిస్తోందన్నారు.ఈ ఆరోపణలు విచారణలో నిజమని తేలితే సంబంధిత వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు, నకిలీ సర్టిఫికెట్ల వెనుక ఉన్న మధ్యవర్తులు, దళారులు లేదా అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని అన్నారు.రెగ్యులరైజేషన్ ప్రక్రియలో రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్, అర్హత, సీనియారిటీ, ప్రభుత్వ నిబంధనలు, న్యాయస్థానాల ఆదేశాలు పూర్తిగా పాటించారా లేదా అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని హన్మండ్లు కోరారు. నిర్ణయాలు ఏ నిబంధనల ఆధారంగా తీసుకున్నారో ప్రజలకు తెలియజేయాలని అన్నారు.మరో 100 మందికి పైగా లెక్చరర్ల సర్టిఫికెట్లపై స్పష్టత రావాల్సి ఉందనే సమాచారంపైనా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.అర్హత ఉన్న ఉద్యోగులకు అన్యాయం జరగకుండా, అనర్హులకు అవకాశం లేకుండా సర్టిఫికెట్ల ధ్రువీకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.ఇది కేవలం ఉద్యోగాల అంశం మాత్రమే కాదని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న విషయమని హన్మండ్లు పేర్కొన్నారు. అర్హత, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులే విద్యార్థులకు బోధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వ ఉద్యోగం ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు. అర్హత ఉన్న నిరుద్యోగులకు న్యాయం జరగాలి. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం నిజమైతే బాధ్యులందరినీ గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.నిజాయితీగా ఉన్నవారిని రక్షిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి అని చందూరి హన్మండ్లు డిమాండ్ చేశారు.

