డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు ఆధునిక వరి సాగుపై అవగాహన
ఆధునిక పద్ధతులతో రైతుకు ఖర్చు తగ్గింపు–లాభం పెంపు
కోటగిరి, ఫిబ్రవరి 04(డిడి9 వార్త):
బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరి పంటలో నూతన సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ అధికారులు సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ డ్రం సీడర్ ద్వారా నేరుగా వరి విత్తడం, అలాగే ఆల్టర్నెట్ వెట్టింగ్ అండ్ డ్రైయ్యింగ్ పద్ధతిలో నీటి యాజమాన్యం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు.ఈ ఆధునిక పద్ధతుల ద్వారా పెట్టుబడి భారం తగ్గడంతో పాటు, కూలీల ఖర్చు సుమారుగా రూ.8,000 వరకు ఆదా అవుతుందని తెలిపారు. అలాగే సాగు సమయంలో సమయం ఆదా కావడంతో పాటు, AWD పద్ధతితో నీటి వినియోగం నియంత్రణలో ఉండి నీటి వృథా తగ్గుతుందని పేర్కొన్నారు.వరిపొలాల్లో విషవాయువుల ఉద్గారం తగ్గి వాతావరణ పరిరక్షణకు దోహదం కలుగుతుందని, భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు, మందుల వినియోగం తగ్గించుకుంటే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని వివరించారు. మెట్ట మరియు దుక్కి భూముల్లో ఈ పద్ధతులు అనుసరిస్తే చీడపీడల నివారణ సులభతరం అవుతుందని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈవో సతీష్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ అధికారులు వీరాస్వామి (డిప్యూటీ మేనేజర్), అరుణ్ (ఏరియా మేనేజర్), కమ్యూనిటీ ఫెసిలిటేటర్లు ప్రశాంత్, లక్ష్మణ్, గ్రామ రైతులు పాల్గొన్నారు.

