ఆరోగ్యాభివృద్ధికి యోగా కీలకం: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, ఏప్రిల్ 10(డిడి9 వార్త):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా ప్రణాళిక – ప్రగతి పాలన 99 రోజుల కార్యాచరణలో భాగంగా హోమియోపతి & ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి జిల్లా యోగ కేంద్రంలో యోగా తరగతులు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై యోగా శిబిరాన్ని ప్రారంభించారు.జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్‌డీవో వై.వి.గిరి,ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో పాటు జిల్లా స్థాయి అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రగతి పాలన అనేది కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధికే పరిమితం కాకుండా ప్రజల ఆరోగ్యాభివృద్ధిని కూడా లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఆయుష్ వైద్యం, యోగా భారతీయ సంస్కృతిలో కీలక భాగమని, వీటిని ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ఆరోగ్య శాఖపై ఉందని అన్నారు.ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఆయుష్ వైద్య విధానాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని, యోగా, ఆయుర్వేదం, హోమియోపతి వంటి సంప్రదాయ వైద్య పద్ధతులు ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు జీవనశైలిని మెరుగుపరుస్తాయని వివరించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా ఆయుష్ వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అవగాహన సదస్సులో డిఎమ్ & హెచ్వో మాట్లాడుతూ, జీవనశైలి వ్యాధుల నివారణలో యోగా, ప్రాణాయామం కీలకమని తెలిపారు. అనంతరం ఆయుష్ విభాగం యోగా ఇన్‌స్ట్రక్టర్ ఆధ్వర్యంలో 45 నిమిషాలపాటు యోగా శిక్షణ నిర్వహించబడింది. ఇందులో సూక్ష్మ వ్యాయామాలు, తాడాసనం, వృక్షాసనం, భుజంగాసనం వంటి యోగా ఆసనాలు, అనులోమ-విలోమ, భ్రామరీ ప్రాణాయామాలు, ధ్యానం చేయించబడ్డాయి.కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలపాటు యోగా చేయాలని, ప్రజల్లో యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

