రాజ్యాంగమే ప్రజాస్వామ్యానికి పునాది – 77వ గణతంత్ర దినోత్సవంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
బాన్సువాడ, జనవరి 26 (డిడి9 వార్త):
భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోను, ఆయన నివాసంలోను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బాన్సువాడ డీఎస్పీ, స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ…బాన్సువాడ నియోజకవర్గ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం కులమతాలకు అతీతంగా దేశ ప్రజలందరూ ఐక్యంగా జరుపుకునే పండుగ అని అన్నారు.ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగఫలంగా లభించిన స్వాతంత్ర్యాన్ని పరిపాలనలో అమలు చేయాల్సిన బాధ్యతలు, విధులను స్పష్టంగా నిర్దేశించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈ రోజు అని గుర్తు చేశారు.స్వతంత్ర భారతదేశ ప్రయాణానికి దిక్సూచిగా నిలిచిన రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ డా. బీ.ఆర్. అంబేడ్కర్ నాయకత్వంలోని కమిటీ 2 సంవత్సరాలు 11 నెలలు 8 రోజులు శ్రమించి రూపొందించిందని వివరించారు.రాజ్యాంగం అత్యంత పవిత్రమైనదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు మూలాధారం రాజ్యాంగమేనని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగిన గొప్ప దేశం భారత్ అని పేర్కొన్నారు. వివిధ మతాల ప్రజలు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌ను గౌరవించినప్పటికీ, దేశంలోని అన్ని వర్గాల ప్రజలు గౌరవించేది భారత రాజ్యాంగమేనని స్పష్టం చేశారు.
దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

