బీర్కూరులో కలుషిత త్రాగునీరు… ప్రజల ఆరోగ్యంతో చెలగాటం
బీర్కూర్, మార్చి 21 (డిడి9 వార్త): బీర్కూర్ మండల కేంద్రంలోని ఇందిరా కాలనీలో త్రాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. గత వారం రోజులుగా కాలనీలో సరఫరా అవుతున్న త్రాగునీరు పూర్తిగా కలుషితమై ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. నీటిలో మట్టి, మురుగు మిశ్రమాలు రావడంతో త్రాగునీరు డ్రైనేజ్ నీటిలా మారిపోయిందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కలుషిత నీటిలో పురుగులు కూడా కనిపిస్తున్నాయని, ఈ నీటిని ఉపయోగించడం వల్ల జ్వరం, ఒళ్లంతా దురద వంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. త్రాగడానికి మాత్రమే కాకుండా రోజువారీ అవసరాలకు కూడా ఈ నీటిని వినియోగించలేని పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు.
ఇందిరా కాలనీలో త్రాగునీటి పైప్‌లైన్లు దెబ్బతిన్నాయా? లేక డ్రైనేజ్ నీరు కలుస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు తెలియజేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీవాసులు మండిపడుతున్నారు.ప్రజల ఆరోగ్యంతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పైప్‌లైన్లను పరిశీలించి శుద్ధమైన త్రాగునీరు సరఫరా చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు.

