భారీ వర్షాల అనంతరం అంటువ్యాధుల నివారణకు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి జిల్లా బ్యూరో, ఆగస్టు 05(డిడి9 వార్త): ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నీటి కలుషితం, చెత్త పేరుకుపోవడం, నిల్వ నీరు ఏర్పడటం, దోమల వ్యాప్తి వంటి కారణాలతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విజ్ఞప్తి చేశారు.ప్రజలు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య రక్షణతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తాగునీటిని తప్పనిసరిగా మరిగించి లేదా శుద్ధి చేసిన తర్వాత మాత్రమే తాగాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి చెత్తను నిర్ణీత ప్రదేశాల్లో వేయాలని కోరారు.కాలువలు, డ్రైనేజీలు మూసుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతో పాటు నిల్వ నీరు లేకుండా చూసుకుని దోమల నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో విక్రయించే ఆహారాన్ని వీలైనంత వరకు నివారించాలని సూచించారు. సబ్బుతో తరచూ చేతులు కడుక్కోవడం, తడి దుస్తులను వెంటనే మార్చుకోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత చర్యలను పాటించాలని తెలిపారు.జ్వరం, విరేచనాలు, వాంతులు లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రి లేదా వైద్యుడిని సంప్రదించాలని, పాఠశాలలు, కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, గృహాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు పరిశుభ్రత కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని, ప్రజలు కూడా వాటిలో చురుకుగా భాగస్వాములు కావాలని కోరారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, "పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది.ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను కాపాడితే అంటువ్యాధులను సమర్థవంతంగా నివారించవచ్చు.మీ ఆరోగ్యం, మీ కుటుంబ ఆరోగ్యం, మన జిల్లా ఆరోగ్యం.అందరం కలిసి పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన కామారెడ్డి జిల్లాను నిర్మిద్దాం" అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

