అప్పుల భారంలేకుండా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వ చేయూత
63 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పోచారం

బాన్సువాడ, జూలై 30 (డీడీ9 వార్త): పేద కుటుంబాలు అప్పుల భారానికి గురికాకుండా తమ కుమార్తెల వివాహాలను గౌరవప్రదంగా నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.గురువారం బాన్సువాడలోని తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 63 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్భాటాలకు వెళ్లి అప్పులు చేసి ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.ఈ పథకాల ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోందని, తల్లిదండ్రులు ఎలాంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా తమ కుమార్తెల వివాహాలను నిర్వహించుకునే అవకాశం కలుగుతోందని తెలిపారు.ప్రస్తుతం వివాహం అనంతరం అందజేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను భవిష్యత్తులో వివాహానికి ముందే అందించే విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ఎమ్మెల్యే వెల్లడించారు. అధికారులు కూడా చెక్కులను పెళ్లి పందిరిలోనే అందించేలా చర్యలు చేపట్టాలని సూచించినట్లు చెప్పారు.అనంతరం రైతాంగ సంక్షేమంపై మాట్లాడుతూ, రైతులకు ఏడాది పొడవునా సాగునీటి కొరత లేకుండా ఉండేలా ప్రభుత్వం నీటి వనరుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని విస్తృతంగా చేపడుతున్నామని, వీటి ద్వారా భూగర్భ జలమట్టాలు పెరగడంతో పాటు వ్యవసాయానికి అవసరమైన నీరు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.రైతుల సంక్షేమం, పేద ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, అధికారులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

