అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
న్యాయం చేయాలంటూ గ్రామపంచాయతీ ఆవరణలో బాధితుల ధర్నా
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): తమ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు శనివారం బీర్కూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.బాధితుల వివరాల ప్రకారం.. బీర్కూర్ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 611లో మొత్తం 69 గుంటల భూమి ఉందన్నారు.1978లో అదే గ్రామానికి చెందిన కొత్తిడ్గి నాగయ్యకు 35 గుంటల భూమిని విక్రయించినట్లు తెలిపారు.అనంతరం నాగయ్య ఆ భూమిని మేకల సత్యవతికి విక్రయించినట్లు పేర్కొన్నారు.అయితే మిగిలిన 34 గుంటల భూమిలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మేకల సత్యవతి నిర్మాణాలు చేపడుతున్నారని ఇర్పా శంకరప్ప కుటుంబ సభ్యులు ఆరోపించారు.ఈ విషయంపై ఇప్పటికే తహసీల్దార్, గ్రామపంచాయతీ అధికారులకు వినతిపత్రాలు అందజేసి నిర్మాణాలను నిలిపివేయాలని కోరినట్లు తెలిపారు.అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.భూమికి సంబంధించిన రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించి, వివాదాస్పద స్థలంలో జరుగుతున్న నిర్మాణాలను తక్షణమే నిలిపివేసి తమకు న్యాయం చేయాలని రెవెన్యూ, పంచాయతీ శాఖ అధికారులను కోరారు.అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు.అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటిని కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తామని బాధితులు పేర్కొన్నారు.

