స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలి
ఆర్మూర్ లో సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేవైఎం
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో సుమారు రూ.14,000 కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి దాపురించిందన్నారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం 'ఫీజుల బకాయిలు – బీజేపీ లడాయి' పేరుతో ఆందోళనలు కొనసాగిస్తున్నామని, ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు విడుదల చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, నాయకులు ఉదయ్ గౌడ్, శ్రావణ్ గౌడ్, పుల్కం వేణు తదితరులు పాల్గొన్నారు.


