జాతీయ ఓటర్ దినోత్సవానికి అర్థవంతమైన వైద్య సేవ
ప్రజాస్వామ్యానికి దంత వైద్యుడి సేవ – ‘మన ఓటు మన బాధ్యత’కు డాక్టర్ జీవన్ చాటింపు
బాన్సువాడ, జనవరి 25(డిడి9 వార్త):
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రుక్మిణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల & ఇంప్లాంట్ సెంటర్ విశేష పాత్ర పోషిస్తోంది. వైద్య సేవలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతను భుజాన వేసుకున్న ఈ దంత వైద్యశాల నిర్వాహకులు డాక్టర్ అచ్చు కట్ల జీవన్ పలు సంవత్సరాలుగా “మన ఓటు – మన హక్కు, మనందరి బాధ్యత” అనే నినాదంతో ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది కూడా ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికీ రుక్మిణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలలో ఉచిత దంత పరీక్షలు నిర్వహిస్తూ ప్రజల్లో ఓటింగ్‌పై ఆసక్తి పెంపొందించే వినూత్న ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ జీవన్ మాట్లాడుతూ,“ఓటు హక్కు కేవలం ఒక హక్కు మాత్రమే కాదు… అది ప్రతి పౌరుడి బాధ్యత. ఓటు ద్వారా మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకుంటాం. యువతతో పాటు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటింగ్‌లో పాల్గొనాలి” అని పిలుపునిచ్చారు.
వైద్య వృత్తితో పాటు సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని చేపడుతున్న ఈ తరహా కార్యక్రమాలు ప్రశంసనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక వైద్యుడు ముందుకు రావడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు.
వైద్యం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతూ, అవగాహన ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా డాక్టర్ జీవన్ చేపడుతున్న ఈ కార్యక్రమం జాతీయ ఓటర్ దినోత్సవానికి మరింత అర్థవంతతను చేకూర్చింది.

