ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఎంఈవో వెంకన్న హెచ్చరిక
బీర్కూర్, జూన్ 17(డిడి9 వార్త):
బీర్కూర్ మండలంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) వెంకన్న విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలకు విరుద్ధంగా ఏ పాఠశాల యాజమాన్యం వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.విద్యార్థుల నుంచి నోట్‌బుక్స్, యూనిఫాంలు, అధిక ఫీజులు లేదా డొనేషన్లు బలవంతంగా వసూలు చేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపే చర్యలకు పాల్పడితే సంబంధిత పాఠశాలలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అలాగే విద్యా శాఖ నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన శిక్షలు విధించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించి, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని ఎంఈవో వెంకన్న సూచించారు.

