అభివృద్ధి పేరుతో బరంగెడ్గి రైస్ మిల్‌కు అర్ధరాత్రి మొరం తరలింపు
బీర్కూర్ / బరంగేడ్గి 08(డిడి9 వార్త) :
అనుమతులు లేకుండా విచ్చలవిడిగా మొరం తరలింపు కొనసాగుతున్న ఘటన బీర్కూర్ మండలంలోని బరంగెడ్గిలో కలకలం రేపుతోంది. అభివృద్ధి పనుల పేరుతో అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో టిప్పర్ల ద్వారా భారీ ఎత్తున మురం తరలిస్తున్న వైనం స్థానికుల ఆందోళనకు కారణమవుతోంది.సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే, ప్రభుత్వ భూముల నుంచి మురం తవ్వకాలు చేపడుతూ రాత్రివేళల్లో బరంగేడిగి రైస్ మిల్‌కు తరలిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని, భూగర్భజలాల స్థాయి పడిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అర్ధరాత్రి వేళ భారీ టిప్పర్లు తిరుగుతూ మురం తరలిస్తుండటంతో రోడ్లకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, వాహనాల శబ్దాలతో గ్రామ ప్రజలు నిద్రకు కూడా అంతరాయం కలుగుతోందని స్థానికులు వాపోతున్నారు.
ఈ అక్రమ కార్యకలాపాలపై రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖలు వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అనుమతులు లేకుండా మురం తవ్వకాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే ఇలాంటి అక్రమాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

