గర్భిణీ ఆరోగ్యమే బిడ్డకు భరోసా: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, జూలై 30(డిడి9 వార్త):
గర్భిణీ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.బాన్సువాడలోని తన నివాసంలో కల్యాణలక్ష్మి, ష్యాది ముబారక్ చెక్కుల పంపిణీ అనంతరం మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.గర్భిణీ స్త్రీలకు పోషకాహారంతో కూడిన సమతుల్య ఆహారం అందించడం ప్రతి కుటుంబ సభ్యుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.గ
ర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు.పుట్టిన వెంటనే శిశువుకు తొలి పాలు (ముర్రుపాలు) తప్పనిసరిగా ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు.తల్లి పాలలో శిశువు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు సమృద్ధిగా ఉంటాయని వివరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేను కూడా చిన్నతనంలో మా తల్లి పాలను నాలుగేళ్ల పాటు తాగాను.అందువల్లే ఆరోగ్యంగా ఉన్నాను. ప్రతి బిడ్డకు తల్లి పాలు అందితే వారు కూడా ఆరోగ్యంగా పెరుగుతారు అని పేర్కొన్నారు.ప్రతి కుటుంబం శుభ్రమైన, సురక్షితమైన తాగునీటినే వినియోగించాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా అనేక అంటువ్యాధులను నివారించవచ్చని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, లబ్ధిదారులు ఉన్నారు.

