ఆర్.కే డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు పోలీసుల అవగాహన కార్యక్రమం
కామారెడ్డి జిల్లా బ్యూరో, జూలై 30(డిడి9 వార్త): కామారెడ్డి పట్టణంలోని ఆర్.కే డిగ్రీ కళాశాలలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు కళాబృందం విద్యార్థులకు ప్రేమ పేరుతో జరిగే మోసాలు, పోక్సో చట్టం, మైనర్ డ్రైవింగ్ ప్రమాదాలు, మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలు, మైనర్లపై జరిగే నేరాలు, మానవ అక్రమ రవాణా నివారణ వంటి అంశాలపై వివరించారు.సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితరాలను జాగ్రత్తగా వినియోగించాలని, అపరిచితులను నమ్మి మోసపోవద్దని సూచించారు. చిన్న పొరపాటు కూడా జీవితాన్ని నాశనం చేసే ప్రమాదం ఉందని, తల్లిదండ్రులు, అధ్యాపకుల సూచనలను పాటిస్తూ మంచి లక్ష్యంతో చదువుకోవాలని విద్యార్థులకు సందేశం ఇచ్చారు.ఈ సందర్భంగా సైబర్ నేరాల టోల్ ఫ్రీ నంబర్ 1930, మాదకద్రవ్యాల ఫిర్యాదుల కోసం 1908, షీ టీమ్స్ నంబర్ 8712686094, అత్యవసర పరిస్థితుల్లో 100/112కు కాల్ చేయాలని సూచించారు.పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు. శేషరావు, పీసీలు ప్రభాకర్, సాయిలు పాటలు, సందేశాల ద్వారా విద్యార్థుల్లో చైతన్యం కల్పించారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ ఎం. జయపాల్ రెడ్డి, భరోసా సిబ్బంది రజిత, కవిత, మహిళా సాధికారిత కేంద్రం ఇన్‌చార్జి సౌందర్య, తులసి, సరిత (అడ్వకేట్లు), సిద్ధ రామయ్య, నవీన్, మానవ అక్రమ రవాణా నియంత్రణ విభాగానికి చెందిన పీసీ రాజేందర్ పాల్గొని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

