సంగీత మృతికి బాధ్యురాలైన ప్రిన్సిపాల్ సునీతను వెంటనే అరెస్ట్ చేయాలి
రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి – వామపక్ష విద్యార్థి సంఘాల హెచ్చరిక
బాన్సువాడ, జనవరి 27(డిడి9 వార్త):
బోర్లం బాలికల గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్థిని సంగీత మృతి ఘటనపై వామపక్ష విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ఘటనకు నేటికి మూడు రోజులు గడుస్తున్నా ప్రధాన నిందితురాలిగా పేర్కొంటున్న ప్రిన్సిపాల్ సునీతను అరెస్టు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించాయి.బాన్సువాడ పట్టణంలోని ఆర్‌ఎన్‌బీ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఎన్. బాల్‌రాజ్ మాట్లాడుతూ విద్యార్థిని సంగీతను ప్రిన్సిపాల్ సునీత తన వ్యక్తిగత పనులకు వాడుకోవడం వల్లే ఈ దారుణ హత్యకు సమానమైన ఘటన జరిగిందని తీవ్రంగా విమర్శించారు. ఒక నిండు ప్రాణం బలైపోవడానికి బాధ్యురాలైన ప్రిన్సిపాల్ సునీత విద్యార్థిని కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా, సంగీత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ సునీతపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి, 420 సెక్షన్‌తో పాటు నాన్‌బెయిలబుల్ కేసులు బుక్ చేసి జైలుకు పంపాలని, శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ప్రిన్సిపాల్ సునీత నివాసాన్ని ముట్టడించడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగుతామని వామపక్ష విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి.ఈ సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రఘురామ్ నాయక్, టీఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు మావురం శ్రీకాంత్, డీఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జీవన్ రాథోడ్‌తో పాటు కుషాల్, రమేష్, మైపాల్, సుభోద్ సాయి తదితర నాయకులు పాల్గొన్నారు.

