నిజాంసాగర్ రిజర్వాయర్లో ప్రైవేటుగా చేప–రొయ్య పిల్లలను వదలడం నిషేధం
కామారెడ్డి,నవంబర్ 25(డిడి9 వార్త): నిజాంసాగర్ రిజర్వాయర్లో అనధికారికంగా ప్రైవేటు వ్యక్తులు చేపలు మరియు రొయ్య పిల్లలను వదలడంపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. 2025–26 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మత్స్యశాఖ ఆధ్వర్యంలో 100% ప్రభుత్వ గ్రాంట్‌తో (ఉచితంగా) చేప మరియు రొయ్య పిల్లలను వదిలే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారుల సమాచారం.మత్స్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం, నిజాంసాగర్ రిజర్వాయర్లోని మత్స్యసంపదపై పూర్తి హక్కులు ప్రభుత్వానికే ఉన్నాయి. కావున ఎలాంటి ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు కంపెనీలు, ఏజెన్సీలు లేదా అనధికారిక సంఘాలు రిజర్వాయర్లో ప్రైవేటుగా చేప/రొయ్య పిల్లలను వదిలే చర్యలు పూర్తిగా నిషేధించబడ్డాయి.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
రిజర్వాయర్లో అనధికారికంగా చేపలు లేదా రొయ్య పిల్లలను వదిలిన వ్యక్తులపై మత్స్యశాఖ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించబడతాయి. చట్టపరమైన చర్యల విషయంలో ఎలాంటి సడలింపు ఉండదని స్పష్టం చేశారు.
అధికారిక స్టాకింగ్ మాత్రమే అనుమతి
నిజాంసాగర్ రిజర్వాయర్లో చేప లేదా రొయ్య పిల్లలను వదిలే కార్యక్రమం కేవలం కామారెడ్డి జిల్లా మత్స్యశాఖ కార్యాలయం ద్వారానే అధికారికంగా నిర్వహించబడుతుంది. ఇతరుల ద్వారా చేపట్టే ప్రయత్నాలు చట్ట విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.
అనధికారికంగా సీడ్ వేసి తమకే ఆర్థిక నష్టం కలిగించుకోవద్దని, చట్టపరమైన సమస్యల్లో చిక్కుకోకూడదని మత్స్యకారులకు మత్స్యశాఖ విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఉచిత స్టాకింగ్ కార్యక్రమానికి సహకరించాలని, ఈ సమాచారాన్ని ఇతర మత్స్యకారులకు కూడా చేరవేయాలని కోరారు.

