బీర్కూర్‌లో పడకేసిన పారిశుధ్యం… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
బీర్కూర్, ఏప్రిల్ 23(డిడి9 వార్త):
బీర్కూర్ పట్టణ కేంద్రంలో పారిశుధ్య పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. కాలనీల్లో డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి పొంగిపొర్లుతూ తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది.ఈ దుర్గంధ వాతావరణంలో జీవించడం కష్టంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు పేరుకుపోవడం, కాలువల్లో మురుగు నిల్వ ఉండటం వల్ల దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్నాయి.ప్రజల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి నెలకొన్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కాలనీ వాసుల ఆగ్రహం మరింత పెరుగుతోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు.వేసవి కాలం కావడంతో మురుగునీరు నిల్వ ఉండటం వల్ల వ్యాధులు వ్యాపించే ప్రమాదం అధికమవుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ పారిశుధ్యంపై సరైన దృష్టి పెట్టకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి డ్రైనేజీలను శుభ్రం చేయించడం, చెత్త తొలగింపు చర్యలు చేపట్టడం, పారిశుధ్యాన్ని మెరుగుపరచడం అత్యవసరమని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ప్రజలు అనారోగ్యం పాలవుతారని అన్నారు.

