బోధన్ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్లను నియమించాలి: విద్యార్థి సంఘాల డిమాండ్
బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా
అధ్యాపకులు లేక అల్లాడుతున్న విద్యార్థులు
బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ ఫాకల్టీ అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ, బహుజన విద్యార్థి ఫోర్స్ (బీవీఎఫ్) ఆధ్వర్యంలో విద్యార్థులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు వడ్ల సతీష్ చారి, సిరివెసు సంతోష్ మాట్లాడుతూ.. కళాశాలలో ఒకేషనల్ కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లీష్, జనరల్ ఫౌండేషన్ కోర్స్ మరియు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సబ్జెక్టులు బోధించడానికి గత రెండు సంవత్సరాలుగా సంబంధిత అధ్యాపకులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేట్ కళాశాలల్లో వృత్తి విద్యా కోర్సులు చదవాలంటే రూ. 18 వేల నుంచి రూ. 20 వేల వరకు ఖర్చవుతుందని, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో విడుదల కాక మెమోలు, టీసీలు పొందడంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని కొన్ని జూనియర్ కళాశాలల్లో 100 మంది విద్యార్థులు కూడా లేకపోయినా అక్కడ అధ్యాపకులు ఉన్నారని, కానీ 345 మంది విద్యార్థులున్న బోధన్ కళాశాలలో అధ్యాపకులు లేకపోవడం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు విమర్శించారు. వచ్చే వారం రోజుల్లోగా గెస్ట్ ఫాకల్టీని నియమించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వడ్ల సతీష్ చారి, సిరివెసు సంతోష్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.


