కన్నీటి ఏడారిలో.. కైలాష్‌ కథ ముగిసె

కన్నీటి ఏడారిలో.. కైలాష్‌ కథ ముగిసె

కళ్లముందే పెరిగి పెద్దవాడైన కొడుకు.. ఉన్నత చదువులు చదివి, కుటుంబానికి అండగా ఉంటాడని ఆశపడ్డ తల్లిదండ్రులకు ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఐదేళ్ల క్రితం ఉపాధి కోసం కువైట్‌ వెళ్లిన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కోరట్‌పల్లి తండాకు చెందిన గుగ్లోత్ కైలాష్‌.. ఇప్పుడు విగతజీవిగా మారాడు. అదీ మాతృభూమికి వేల మైళ్ల దూరంలో ఉన్న ఎడారిలో శవమై తేలడం ఆ కుటుంబాన్ని తీరని శోకంలో ముంచెత్తింది.

ఎడారిలో మౌన రోదన

మార్చి 19.. ఆ రోజుతో కైలాష్‌ గొంతు తల్లిదండ్రులకు వినిపించలేదు. కొడుకు కనిపించడం లేదని ఆ తల్లిదండ్రులు నాలుగు నెలలుగా పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు. కంటికి రెప్పలా పెంచుకున్న కైలాష్‌ కోసం వారు పడ్డ తపన ఆ దేవుడికి కూడా కనిపించలేదా అన్నట్టుగా ఉంది పరిస్థితి. అసలు నిజం తెలిసేసరికి వారి గుండెలు బద్దలయ్యాయి. కైలాష్‌ చనిపోవడమే కాకుండా, తోటి మనిషిని మనుషులు పశువుల్లా ఎడారి ఇసుకలో పాతిపెట్టారన్న వార్త మానవత్వాన్ని మంటగలిపింది.

తోటివాడే కాలమయ్యాడు

నిజానికి, కైలాష్‌కు తోడుగా ఉంటాడనుకున్న నిందితుడు కూడా అదే డిచ్‌పల్లి మండలం సాంపల్లికి చెందినవాడు. సొంత ప్రాంతం నుంచి వెళ్లిన వ్యక్తి, తోటివాడిని కాపాడాల్సింది పోయి.. ప్రాణం పోయాక ఆ శవాన్ని కూడా ఎడారిలో అనాథలా పాతిపెట్టడం దారుణం. భయం అన్న ముసుగులో చేసిన ఈ అమానుషం ఇప్పుడు రెండు తండాల్లో విషాదాన్ని నింపింది.

తీరని శూన్యం

సివిల్ ఇంజినీరింగ్ చదివి, కుటుంబానికి కొండంత అండగా నిలవాల్సిన యువకుడు ఇలా మధ్యలోనే ప్రాణాలు కోల్పోవడం కోరట్‌పల్లి తండాను శోకసంద్రంలో ముంచేసింది. నిందితుడి తండ్రి స్వదేశానికి పారిపోయి వచ్చినా, కైలాష్‌ మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. కొడుకు తిరిగి వస్తాడన్న ఆశతో ఉన్న తల్లిదండ్రుల కళ్లలో నీళ్లు ఇప్పుడు ఆరని గాయాలయ్యాయి. ఈ దారుణానికి పాల్పడిన వారిపై చట్టం కఠినంగా స్పందించాలని, తమకు న్యాయం చేయాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.

Views: 18
Tags:

About The Author

Latest News