రెవెన్యూ, పోలీస్ మా చేతుల్లోనే ఉన్నారు.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మొరం మాఫియా దౌర్జన్యం..!
కిష్టాపూర్‌లో విచ్చలవిడిగా అక్రమ మొరం తవ్వకాలు
అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థుల ఆగ్రహం
బీర్కూర్, జూలై 13 (డిడి9 వార్త): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే మొరం అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని గ్రామస్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రాత్రింబవళ్లు భారీ యంత్రాలతో మొరం తవ్వి ట్రాక్టర్లు,టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ సాగుతున్న ఈ అక్రమ వ్యవహారం వల్ల ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆదాయ నష్టం వాటిల్లడమే కాకుండా గ్రామంలోని రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామస్థుల కథనం ప్రకారం, అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారు ఎలాంటి భయం లేకుండా బహిరంగంగానే వ్యవహరిస్తున్నారు. వారిని ప్రశ్నించిన గ్రామస్థులను రెవెన్యూ,పోలీస్ మా చేతుల్లోనే ఉన్నారు... ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఈ వ్యాఖ్యలు స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని, అక్రమ తవ్వకాల వెనుక కొందరు ప్రభావశీలుల అండదండలు ఉన్నాయనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.గ్రామస్థులు పలుమార్లు సంబంధిత అధికారులకు, రెవెన్యూ శాఖకు, పోలీసులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ఫలితం కనిపించలేదని తెలిపారు. ఫిర్యాదుల అనంతరం కూడా యథావిధిగా మొరం తరలింపు కొనసాగుతుండటంతో అధికారుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.అక్రమ మొరం తవ్వకాల వల్ల గ్రామంలోని ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయని, భారీ వాహనాల రాకపోకల కారణంగా దుమ్ము, ధూళి విపరీతంగా ఎగసిపడుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, మహిళలు రహదారులపై ప్రయాణించేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో రహదారులు మరింత దెబ్బతిని ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.ఈ విషయమై బీర్కూర్ తహసీల్దార్‌ను సంప్రదించగా,కిష్టాపూర్ గ్రామంలో మొరం తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. రెవెన్యూ, గనుల శాఖ, పోలీసు శాఖలతో కలిసి విచారణ నిర్వహించి నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.అయితే గ్రామస్థులు మాత్రం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అక్రమ తవ్వకాల్లో ఉపయోగిస్తున్న జేసీబీలు,ట్రాక్టర్లు,టిప్పర్లను స్వాధీనం చేసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ భూములు, సహజ వనరులను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.కిష్టాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఈ అక్రమ మొరం తవ్వకాలపై జిల్లా కలెక్టర్, గనుల శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ మరియు పోలీసు అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఇటువంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టకపోతే భవిష్యత్తులో మరింత విస్తరించే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

