అంతర్ జిల్లా ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్
ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాతో పాటు, దొంగిలించిన సొత్తును కొనుగోలు చేస్తున్న ఇద్దరు స్క్రాప్ వ్యాపారులను నిజామాబాద్ జిల్లా రెంజల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు స్క్రాప్ వ్యాపారుల కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి 80 కేజీల రాగి కాయిల్స్, 3 మోటార్ సైకిళ్లు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. గురువారం సాయంత్రం రెంజల్ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి సాటాపూర్ బైపాస్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మూడు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా వస్తున్న ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకుని తనిఖీ చేయగా, ఒక గన్నీ బ్యాగులో ట్రాన్స్‌ఫార్మర్ రాగి కాయిల్స్ లభ్యమయ్యాయి. పట్టుబడిన వారిని మెదక్ పట్టణానికి చెందిన వనం సాయిలు, జగన్నాధం సారయ్య అలియాస్ శ్రీనివాస్, ధన శ్రీ కిరణ్, బోధన్‌కు చెందిన వనం పోశెట్టి, నారాయణఖేడ్‌కు చెందిన దాసరి పోచయ్యగా గుర్తించారు.
వీరిని నిఘా నేత్రంతో విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. గత రెండేళ్లుగా ఈ ఐదుగురు ఒక ముఠాగా ఏర్పడి వివిధ జిల్లాల్లో ఏకంగా 64 ట్రాన్స్‌ఫార్మర్లను పాడుచేసి వాటిలోని రాగి కాయిల్స్ దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని రెంజల్, బోధన్ రూరల్, బోధన్ టౌన్, వర్ని, కోటగిరి, నిజామాబాద్ రూరల్, మోపాల్, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, ఇందల్వాయి ప్రాంతాల్లో 38 దొంగతనాలకు పాల్పడ్డారు. అలాగే కామారెడ్డి జిల్లా పరిధిలోని కామారెడ్డి, బాన్సువాడ, పిట్లం, మద్నూర్, భిక్నూర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, పెద్ద కొడప్‌గల్ ప్రాంతాల్లో 20 ట్రాన్స్‌ఫార్మర్లను, మెదక్ జిల్లాలోని మెదక్ రూరల్, చేగుంట, వెల్దుర్తి ఏరియాలలో 4 దొంగతనాలను, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట పరిధిలో 2 దొంగతనాలను చేసినట్లు నిర్ధారించారు. దొంగిలించిన రాగి సొత్తును బోధన్‌కు చెందిన సయ్యద్ అక్బర్ హుస్సేన్, నిజామాబాద్‌కు చెందిన షేక్ మహబూబ్‌లతో పాటు మేడ్చల్ జిల్లాకు చెందిన మాలప్ప మాస్టర్ అలియాస్ గౌతమ్, తాయప్ప దంగల్ అనే స్క్రాప్ వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు తేలింది. వీరిలో స్క్రాప్ కొనుగోలు చేసిన సయ్యద్ అక్బర్ హుస్సేన్, షేక్ మహబూబ్‌లను పోలీసులు అరెస్ట్ చేయగా, మేడ్చల్ జిల్లాకు చెందిన మాలప్ప, తాయప్ప ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఈ భారీ అంతరజిల్లా దొంగతనాల ముఠా గుట్టురట్టు చేసిన బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్, నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సాయినాథ్, రెంజల్ ఎస్ఐ చంద్ర మోహన్, బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి, సీసీఎస్ ఎస్ఐ విట్టల్, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామ్, కానిస్టేబుళ్లు రవి, విశాల్, కృష్ణలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంస పత్రాలను అందజేశారు.


