బోధన్ డివిజన్‌లో నేరాల నియంత్రణపై సీపీ సమగ్ర సమీక్ష

బోధన్ డివిజన్‌లో నేరాల నియంత్రణపై సీపీ సమగ్ర సమీక్ష

బోధన్ పోలీస్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, పెండింగ్ కేసుల పురోగతిపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లా సరిహద్దుల్లో ఎక్కడా అలసత్వానికి తావులేకుండా 24 గంటల పాటు పటిష్టమైన తనిఖీలు చేపట్టాలని, ఇందుకోసం చెక్‌పోస్టుల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. బోధన్ సబ్ డివిజన్ మహారాష్ట్ర సరిహద్దులకు ఆనుకుని ఉన్నందున, అంతరాష్ట్ర సరిహద్దుల గుండా రాకపోకలు సాగించే అనుమానాస్పద వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. పొరుగు రాష్ట్ర పోలీసులతో మెరుగైన సమన్వయం సాధించడం ద్వారా నేరస్థుల కదలికలకు అడ్డుకట్ట వేయవచ్చని స్పష్టం చేశారు.

​ముఖ్యంగా హత్యలు, చోరీలు, సైబర్ మోసాలు, మహిళలపై జరిగే నేరాలతో పాటు డ్రగ్స్, గంజాయి, గుట్కా వంటి అక్రమ రవాణాపై రాజీలేని పోరాటం చేయాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే పాత నేరస్థులు, రౌడీషీటర్లపై నిఘా పటిష్టం చేయడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ బృందాలు విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వంటి జనసంచారం ఉన్న ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై, అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

​రోడ్డు ప్రమాదాల నివారణపై కమిషనర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, జాతీయ, రాష్ట్ర రహదారులను కలిపే లింక్ రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు నిర్మించడంతో పాటు, రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించాలని సూచించారు. రోడ్డు ఇంజనీరింగ్ లోపాలను సరిదిద్దేందుకు సంబంధిత హైవే అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. వాహన చోదకుల్లో మార్పు తెచ్చేందుకు ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లలో బాధితులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించి, ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీటీసీ ఏసీపీ రాజశేఖర్, ప్రత్యేక విభాగాల ఇన్‌స్పెక్టర్లు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

 

Views: 13
Tags:

About The Author

Latest News