మధుమలాంచ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల పునర్నిర్మాణం
పాఠశాలలో నేర్చుకునే మంచి అలవాట్లను విద్యార్థులు దైనందిన జీవితంలో ఆచరిస్తూ, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి.అశోక్ సూచించారు. బోధన్ మండలంలోని మధుమలాంచ ఉన్నత పాఠశాలలో నూతనంగా పునర్నిర్మించిన విద్యార్థుల మరుగుదొడ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ... పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు ముందుకు వచ్చిన దాతలను, పూర్వ విద్యార్థులను ఆయన అభినందించారు. పాఠశాలలో మరుగుదొడ్ల సమస్యపై గత నెలలో కథనాలు రావడంతో జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రూ.1,34,162 ఖర్చుతో పూర్తిస్థాయిలో పునర్నిర్మించినట్లు ఎంఈఓ నాగయ్య తెలిపారు. దీనికోసం బోధన్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అసోసియేషన్, ట్రస్మా ప్రతినిధులు రూ.లక్ష విరాళంగా అందించగా, పూర్వ విద్యార్థులు జి.విద్యాసాగర్ తన తండ్రి సీతారామయ్య జ్ఞాపకార్థం రూ.25 వేలు, ఎంఈఓ నాగయ్య రూ.7,162, ఉదయ్ కిరణ్ మహారాజ్ రూ.2 వేల ఆర్థిక సాయం అందించారని పేర్కొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ముందుకు వచ్చిన ప్రైవేట్ యాజమాన్యాలకు, పూర్వ విద్యార్థులకు విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కిషోర్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు హరికృష్ణ, కార్యదర్శి సురేష్, మాజీ జోనల్ చైర్మన్ విద్యావికాస్ శ్రీనివాస్, ప్రతినిధులు చక్రవర్తి, జయప్రకాష్, ఉపాధ్యాయులు నరేందర్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


