రైల్వే ప్రాజెక్టులపై రేవంత్ మార్క్.. ‘హైస్పీడ్’ కారిడార్లకు గ్రీన్ సిగ్నల్!
By R.Suresh
On
తెలంగాణలో రైల్వే నెట్‌వర్క్‌ను పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. గురువారం ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పలు కీలక ప్రతిపాదనలు చేశారు. ప్రధానంగా తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిసర ప్రాంతాల పారిశ్రామిక రూపురేఖలను మార్చేలా రైలు మార్గాల మంజూరుకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రమే భూమి ఇస్తుంది.. కేంద్రం నిర్మించాలి
కృష్ణా - వికారాబాద్ మధ్య ప్రతిపాదిత రైలు మార్గంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. "ఈ ప్రాజెక్టుకు అయ్యే భూసేకరణ వ్యయాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.. మీరు కేవలం నిర్మాణ నిధులు కేటాయించండి" అని కేంద్ర మంత్రిని కోరారు. కొడంగల్, టేకల్‌కోడ్, దౌల్తాబాద్‌లను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నామని.. టేకల్‌కోడ్‌లో ఉన్న అపారమైన సున్నపురాయి నిక్షేపాల వల్ల సిమెంట్ పరిశ్రమలకు ఈ రైలు మార్గం లైఫ్‌లైన్ కానుందని వివరించారు. హైదరాబాద్ నుంచి దేశంలోని మెట్రో నగరాలకు అనుసంధానాన్ని పెంచేలా శంషాబాద్ విమానాశ్రయం వద్ద భారీ హబ్‌ను సీఎం ప్రతిపాదించారు. హైదరాబాద్ - చెన్నై, హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ - పుణే హైస్పీడ్ కారిడార్లన్నీ శంషాబాద్ నుంచే ప్రారంభం కావాలని సూచించారు. ఈ భారీ ప్రాజెక్టుల కోసం ఎయిర్‌పోర్ట్ సమీపంలో 500 ఎకరాల భూమిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అమరావతి మీదుగా బందరు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేయడం ద్వారా డ్రై పోర్టుల నుంచి సరుకు రవాణా వేగవంతం అవుతుందని, ఇది వాణిజ్య రంగానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.
హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి
ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలత వ్యక్తం చేశారు. భూసేకరణ పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ కీలక భేటీలో సీఎం వెంట ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, సురేశ్ షెట్కార్, రఘురాంరెడ్డి, కడియం కావ్య, వంశీకృష్ణ తదితరులు ఉన్నారు.
Views: 7
Tags:
About The Author
Latest News
23 Feb 2026 10:08:44
తెలంగాణ రాష్ట్ర రాజకీయ, పరిపాలనా ముఖచిత్రంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సచివాలయ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర...

