బురదమయంగా రాయల్ కాలనీ రోడ్లు.. అవస్థల్లో ప్రజలు
బోధన్ పట్టణంలోని 34వ వార్డు రాయల్ కాలనీ వాసులు రహదారుల దుస్థితితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండర్ డ్రైనేజీ పైప్‌లైన్ పనుల కోసం గత ఏప్రిల్‌లో రహదారులను తవ్విన అనంతరం పునరుద్ధరణ పనులు పూర్తిగా జరగలేదని స్థానికులు చెబుతున్నారు. పైప్‌లైన్ పనుల అనంతరం రహదారులపై వేసిన మట్టికి ఇటీవల కురుస్తున్న వర్షాలతో బురద చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కాలనీవాసులు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం ఉందని, చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం మున్సిపల్ అధికారులను సంప్రదించినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌కు పనులు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదని వారు అంటున్నారు. రహదారుల మధ్యలో పిచ్చిమొక్కలు పెరగడంతో పాటు బురద నీరు నిలిచిపోవడం వల్ల దోమల బెడద పెరిగే అవకాశం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు రాయల్ కాలనీలో పర్యటించి పరిస్థితిని పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. రహదారులపై ఉన్న బురదను తొలగించి, అవసరమైన మెటల్ వేసి రాకపోకలకు అనువుగా రోడ్లను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


