చెస్ ప్రతిభావంతులకు ఘన సన్మానం
జిల్లా స్థాయి చెస్ పోటీల్లో ప్రతిభ చాటి విజేతలుగా నిలిచిన సాయి సామల చెస్ అకాడమీ విద్యార్థులను బుధవారం బోధన్ పట్టణంలోని ఆర్య సమాజ్‌లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి విద్యా వికాస్ విద్యా సంస్థల అధినేత శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి అండర్-17 పోటీల్లో రిష్విక్ బొర్రోల్లా ఛాంపియన్‌గా, గౌరాంగ అశోక్ రన్నరప్‌గా నిలిచారు. అండర్-13 విభాగానికి సంబంధించి గౌరాంగ అశోక్ ఛాంపియన్‌గా నిలవగా... సామల సాయి సుహాస్, మాదయ్య హితేంద్ర, ల్యాడ్లీ బ్రహ్మిణి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ...చదరంగం విద్యార్థుల్లో వ్యూహాత్మక ఆలోచనను, ఏకాగ్రతను పెంపొందిస్తుందన్నారు. విజేతలైన విద్యార్థులతో పాటు అకాడమీకి సెప్టెంబర్ 5న నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. బోధన్ నుంచి జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కోచ్ సాయిబాబా సామల పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

