పోలీస్ ప్రజావాణిలో 32 అర్జీల స్వీకరణ
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోలీసు సేవలను వినియోగించుకోవచ్చని నిజామాబాద్ జిల్లా పోలీసు కమిషనర్ పి.సాయిచైతన్య తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సీపీ పాల్గొని బాధితుల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 32 అర్జీలు అందగా సీపీ వెంటనే స్పందిస్తూ సంబంధిత పోలీసు స్టేషన్ల సీఐలు, ఎస్ఐలతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. చట్టప్రకారం వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చట్టపరిధిలో బాధితులకు న్యాయం చేస్తూ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేసేందుకే ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

