విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలు నేర్పాలి

- 22ఏ భూచిక్కుల పరిష్కారానికి చర్యలు : -రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి 

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలు నేర్పాలి

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు రైతులకు అడుగడుగునా ఎదురవుతున్న 22ఏ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బోధన్‌లోని ప్రభుత్వ మధుమాలంచ జూనియర్ కళాశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల ఆవరణ, తరగతి గదులను పరిశీలించిన అనంతరం అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో విద్యార్థుల అభ్యసన స్థాయిలు, ఫలితాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు నాణ్యమైన చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను నేర్పించాల్సిన బాధ్యత అధ్యాపకులపైనే ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 28 లక్షల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు, ఉచిత యూనిఫారాలు అందజేస్తూ విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. గత ఏడాది 59 శాతం ఉత్తీర్ణత మాత్రమే రావడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, లెక్చరర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అదనపు తరగతులు నిర్వహించడం ద్వారా 100 శాతం ఫలితాల సాధనకు కృషి చేయాలని నిర్దేశించారు. కళాశాల ప్రాంగణంలో వర్షపు నీరు నిలిచే ప్రాంతాన్ని తనిఖీ చేసి, వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అంశాలపై మాట్లాడుతూ... రైతాంగానికి ఇబ్బందికరంగా మారిన 22ఏ భూముల చిక్కులను పరిష్కరించేందుకు సర్కారు సిద్ధంగా ఉందన్నారు. 3 ఎకరాలు లేదా 50 ఎకరాల విస్తీర్ణంలో కేవలం 3, 4 గుంటల ప్రభుత్వ స్థలం ఉందనే నెపంతో మొత్తం సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల నిజమైన రైతులు తమ భూములను అమ్ముకోలేక, బ్యాంక్ రుణాలు పొందలేక తీవ్ర అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా ఎటువంటి వివాదాలు లేని ప్రైవేట్ భూములను తక్షణమే నిషేధిత జాబితా నుంచి వేరు చేసి క్లియరెన్స్ ఇవ్వాలని తహశీల్దార్లు, సబ్-రిజిస్ట్రార్లు, వీఆర్వోలకు సూచించారు. సర్వేలు, రిజిస్ట్రేషన్ల పేరుతో రైతులను మభ్యపెట్టినా, విధుల్లో అలసత్వం వహించినా సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బందిపై కఠినమైన పరిపాలనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్‌పర్సన్ తాహిర్ బిన్ హమ్దాన్, ఆర్డీవో విజయకుమారి, ఎంఆర్‌వో విట్టల్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి, ప్రిన్సిపల్ నిఖత్ కౌసర్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-08-24 at 9.32.03 PM

Views: 13
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు