సీఎమ్‌ఆర్ ధాన్యం కేటాయింపుల్లో అక్రమాలు?

రైస్ మిల్లులపై విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు

సీఎమ్‌ఆర్ ధాన్యం కేటాయింపుల్లో అక్రమాలు?

రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి పౌరసరఫరాల శాఖకు 'కస్టమ్ మిల్లింగ్ రైస్' రూపంలో అప్పగించాల్సిన ప్రక్రియలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిధుల మళ్లింపు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సీఎంఆర్ నిల్వలపై పౌరసరఫరాలు, విజిలెన్స్ అధికారులు ఉమ్మడిగా ఆకస్మిక తనిఖీలు చేపట్టడం తీవ్ర కలకలం రేపింది.

​గత కొన్ని సీజన్లుగా ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి ఇచ్చే విషయంలో పలు రైస్ మిల్లులు నిబంధనలు పాటించలేదని పౌరసరఫరాల శాఖ ప్రాథమికంగా గుర్తించింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో కాలూర్ పరిధిలోని శ్రీ సిద్ధి రామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్‌లో 2022–23 యాసంగి నుండి 2025–26 రబీ సీజన్ల వరకు సంబంధించి సుమారు 2,03,688 క్వింటాళ్ల ధాన్యం ప్రభుత్వానికి జమ కాలేదని అధికారులు తెలిపారు. దీని విలువ సుమారు ₹66.12 కోట్లుగా అంచనా వేస్తూ సదరు మిల్లు నిర్వాహకుడిపై చట్టపరమైన కేసు నమోదు చేశారు. అదేవిధంగా బోధన్ డివిజన్ సాలూరలోని సాయి లక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్‌లో కేటాయించిన ధాన్యంలో ₹4.31 కోట్ల విలువైన 19,631 క్వింటాళ్లు పక్కదారి పట్టినట్లు తేలడంతో ఆ మిల్లుపై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం.

​మరోవైపు బోధన్ నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి బంధువుల నిర్వహణలో ఉన్న దాదాపు 11 రైస్ మిల్లుల్లో కలిపి ₹58 కోట్లకు పైగా సీఎంఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతి ఏటా నిర్ణీత గడువులోగా సీఎంఆర్ ప్రక్రియ పూర్తి చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ, గతంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ బకాయిలు పేరుకుపోయాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

​ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి సీఎంఆర్ బియ్యాన్ని అప్పగించని డిఫాల్టర్ రైస్ మిల్లులపై అధికారులు ఇప్పుడు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ధాన్యం బకాయిలను రాబట్టేందుకు 'రెవెన్యూ రికవరీ చట్టం' ప్రయోగించే యోచనలో అధికారులు ఉన్నారు. ఈ చట్టం కింద అవసరమైతే సదరు యాజమాన్యాల బ్యాంకు ఖాతాలను స్తంభించజేయడం, ఆస్తులను జప్తు చేయడం వంటి చట్టపరమైన రికవరీ ప్రక్రియలు చేపడతామని యంత్రాంగం సంకేతాలు ఇచ్చింది. అధికారుల సమగ్ర విచారణ కొనసాగుతుండటంతో తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయనేది వేచి చూడాల్సి ఉంది.

 

 

Views: 65
Tags:

About The Author

Latest News