నీలాలో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ
దేశభక్తిని చాటుకోవాలి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి
భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రెంజల్ మండలంలోని నీలా గ్రామంలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీని మంగళవారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి, మండల అధ్యక్షుడు క్యాతం యోగేష్ నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు చేతుల్లో మువ్వన్నెల జెండాలు ధరించి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వడ్డీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ... స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావనను పెంపొందించడానికే ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశ పౌరులంతా తమ ఇళ్లపై జాతీయ జెండాను రెపరెపలాడించి దేశ ఘనతను, ఐక్యతను చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. ర్యాలీ పొడవునా నాయకులు, కార్యకర్తలు చేసిన 'వందేమాతరం', 'భారత్ మాతాకీ జై' నినాదాలతో నీలా వీధులు మారుమోగాయి.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు మోహన్, ప్రధాన కార్యదర్శులు ఈర్ల రాజు, గాండ్ల ప్రసాద్, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్‌ఛార్జులు, వివిధ మోర్చాల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

