‘ఎఫ్‌ఎఫ్‌ఎస్’ యాప్‌తో అక్రమాలకు చెక్
బోధన్‌లో ప్రభుత్వ, ప్రైవేట్డీ డిలర్లకు అవగాహన సదస్సు
రోజూ నిల్వల వివరాలు అప్‌డేట్ చేయాలి: వ్యవసాయ అధికారులు
ఎరువుల పంపిణీ ప్రక్రియలో పారదర్శకతను పెంచడంతో పాటు నిల్వల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్’ యాప్‌ను డీలర్లు సమర్థవంతంగా వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు. బోధన్‌లోని రైతు వేదిక భవనంలో బోధన్, సాలూర మండలాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఎరువుల వ్యాపారులకు ఈ యాప్ నిర్వహణపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా ఎరువులు బుక్ చేసుకునేందుకు, నిల్వల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు ఈ యాప్ ఎంతో దోహదపడుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా డీలర్ల లాగిన్, రోజువారీ స్టాక్ వివరాల నమోదు, ప్లాట్ నమోదు, రైతుల బుకింగ్‌ల ధ్రువీకరణతో పాటు సాంకేతిక సమస్యల పరిష్కారంపై ప్రత్యక్షంగా డీలర్లకు వివరించారు. డీలర్లు ప్రతిరోజూ తమ వద్ద ఉన్న ఎరువుల నిల్వల వివరాలను యాప్‌లో ఎప్పటికప్పుడు పునరుద్ధరించాలని, రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ శ్వేత, వ్యవసాయ విస్తరణ అధికారులు, బోధన్, సాలూర ప్రాంతాలకు చెందిన ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.

